దేవుడెచట నున్నాడు? - Where Is God? Short Moral Story In Telugu


దేవుడెచట నున్నాడు?

పూర్వమొక మహాపట్టణమున ఒక రాజకుటుంబము కలదు. ఆ కుటుంబమునందొక రాజకుమారుడు పాఠశాలలో చదువుకొనుచుండెను. పాఠశాల వార్షికోత్సవ సమయమున విద్యార్థులందరు కలిసి కొన్ని వినోదకార్యక్రమములను ఏర్పాటు చేసుకొనిరి.

ఒకటి రెండు నాటకములను కూడ నిర్వహించిరి. విద్యార్థులలో చక్కని నటనాకౌశలము కలిగినవారు వారివారికి తగిన వేషములను వేసుకొని నాటకమాడిరి. రాజకుమారుడు అందు స్త్ర్తీ వేషమును ధరించెను.

నాటకము బహుమనోరంజకముగ నడచెను. ప్రదర్శనమునకు వచ్చినవారు అపుడపుడు చప్పట్లు చరచుచు తమ ఆహ్లాదమును వ్యక్తపరచిరి. వేషములు ధరించిన వారిలో స్త్రీ వేషధారియైన రాజకుమారుడు తన నటనా సామర్థ్యముచే ప్రేక్షకుల మన్ననలను లెస్సగ చూరగొనెను.

పురుషుడైనను అచ్చట స్త్రీవలెనే అతడు నటించెను. నటనలో సహజత్వము ఉట్టిపడు చుండుటచేతను, బహుశ్రావ్యముగ పాటలు పాడుటచేతను, నాటకమునకు వచ్చిన వారందరును రాజకుమారుని వేనోళ్ళ ప్రశంసించిరి.

రాజకుమారుని స్నేహితుడొకడు స్త్రీ వేషముతో నున్న రాజకుమారుడు రంగస్థలిపై నటించు వేళ అతనిని ఫొటో తీసి తనయింటివద్ద భద్రపరుచుకొనెను.

బహుకాలము గడచిపోయెను. కాలచక్రము రివ్వున తిరుగసాగెను. బాలుడుగనుండి పాఠశాలలో విద్యాభ్యాసము చేయుచున్న రాకుమారుడు క్రమముగ యువకుడయ్యెను. దీర్ఘకాలము గడచిపోవుటబట్టి అతడు తన చిన్నతనమున గావించిన పనులను మరచిపోయెను.

తోడిపిల్లలతో కలసి నాటకమాడిన వృత్తాంతము అతని స్మృతిపథము నుండి పూర్తిగ జారిపోయెను. ఆ సంగతిని పూర్తిగ మరచిపోయెను ఇట్లుండ అతని తండ్రియైన మహారాజు తన తనయునకు యౌవనము సంప్రాప్తించి నట్లెరింగి వివాహము చేయుటకు నిశ్చయించెను.

మంత్రివర్యులు, సామంతులు, అస్థానమందలి పెద్దలు వధువు కొరకై పలుచోట విచారించి, పెక్కు రాజకుటుంబముల వారిని పరామర్శించి తుట్టతుదకు తమకు నచ్చిన నలుగురు రాజకుమార్తెల విషయము రాజున కెరింగించిరి.

నలుగురును రూపలావణ్యము లందేకాక సిరి సంపదలందేకాక విద్యాశీలము లందుకూడ ఎంతయో అధిక్యమును బడసినవారై యుండిరి. ఒకనాడు రాజు తన కుమారుడైన వరుని వెంటబెట్టుకొని, మంత్రిశేఖరులు వెంటరాగా ఆ నలుగురు రాజకుమార్తెలను వారి వారి పట్టణములందు చూచి, కుమారునకున్ను చూపించెను.

రూప సౌందర్యాదులందు వారందరు ఒకరిని మించిన వారు మరియొకరై యుండిరి. వానిని చూడగనే రాజునకు అంతరంగమున పరమతృప్తి జనించినది. వారిలో ఒకరిని ఏరికొని తన కుమారునకు వివాహము చేసి వెయుటకు రాజు దృఢనిశ్చయము గావించుకొనెను.

కాని రాజకుమారునకు వారెవరును నచ్చలేదు. వారందరిని చూచి పెదవిని విరచుకొనెను. "లోకో భిన్నరుచిః" అనునట్లు ఎవరి దృష్టివారిది. ఆ రాజకుమార్తెలు నలుగురు రూపయౌవన సంపదాదులు ఎన్ని గలిగియున్నప్పటికిని వరుడైన రాజకుమారునకు వారు ఏమాత్రము నచ్చలేదు.

ఆ విషయము తెలిసికొని రాజు విహ్వలచేతను డాయెను. ఒకనాడు తన కుమారుని బిలిచి "నాయనా! ఆ నలుగురిలో ఎవరును నీ కిష్టపడనిచో నీకునచ్చిన పెండ్లికుమార్తెను నీవే అన్యత్ర విచారించుకొనుము.

నీ దృష్టికి ఎవరు ఉత్తమురాలుగ తోచునో ఆమెనే వివాహము చేసికొనుము" - అని చెప్పగా రాజకుమారుడట్లే కావించెదని సమాధాన మొసంగెను.

దేవుడెచట నున్నాడు? For Kids

ఇట్లుండ ఒకనాడు రాజకుమారుడు తన మిత్రుని గృహమునకు వెళ్లుట తటస్థించెను. అతని యింటిలోనికి ప్రవేశించగానే చిన్ననాడు తాను పాఠశాల వార్షికోత్సవ సమయమున నాటకమున వేసిన స్త్రీ వేషము యొక్క ఫొటో కనుపించెను.

బహుకాలము గడచిన కారణముచే అది తన స్వరూపమే యని అతడు మరచిపోయెను. ఆ స్త్రీయొక్క సుందర సుకుమార రూపమును గాంచి రాజకుమారుడు మోహపరవశుడై ఆ ఫొటోను తీసుకొని వెళ్లి తన తండ్రికి చూపించి ఫొటోయందలి పిల్లను తాను వివాహము చేసికొనెదననియు, ఆమె యెవరో, యెచటనున్నారో విచారించి రాజభవనమునకు రప్పించవలసినదనియు చెప్పెను.

కుమారుని యభీష్టప్రకారము రాజు అమాత్యశేఖరులను సైనికాధికారులను, ఆస్థాన పురోహితులను కబురుచేసి ఆ ఫొటో వారికి అప్పగించి దేశమంతయు గాలించి అ యువతిని ఎట్లైనను తన భవనమునకు గొనిరావలసినదిగ ఆజ్ఞయిచ్చెను వారట్లే పయనమైపోయి, ఊరూరు, పల్లె పల్లె, పురపురములు గాలించి.

అట్టి రూపవతి యెచటను సందర్భపడక పోవుటచే నిరాశానిస్పృహలచే పరివేష్టితులై తుట్టతుదకు రాజభవనమునకు తిరిగి వచ్చి రాజునకు ఆ వృత్తాంత మంతయును తెలియజేసిరి.

రాజు, రాజకుమారుడు, రాజవంశీయులు అందరును ఆవార్త వినుటతోడనే విషణ్ణవదనులైరి. అత్తరి రాజకుమారుని బాల్య వృత్తాంతమంతయు నెరింగియున్న ఒక ఆస్థాన విద్వాంసుడు ఫొటోయందలి స్త్రీ రాజకుమారుడేయని తెలుపగా అందరును ఆశ్చర్యచకితులైపోయిరి.

ఏ స్త్రీ కొరకై రాజకుమారుడు నలుదిక్కులు వెతికింపజేసెనో, దేశదేశములు గాలింపజేసెనో ఆస్త్రీ యెక్కడనో లేదు. తానే అయియున్నాడు. అది తనరూపమే అయియున్నది.

తాను చిన్నప్పుడే వేసిన వేషమే అది. ఆ విషయము తెలియక ఇంత శ్రమపడవలసి వచ్చినది. ఎక్కడెక్కడో గాలింపవలసి వచ్చినది.

అట్లే దేవునికొరకై జనులు ఎచటెచటనో వెతకుచున్నారు. కాని ప్రతివాని హృదయమందే యతడు విరాజిల్లుచున్నాడు. వెతకు వారికి తప్పక గోచరించుచు వైరాగ్యవిచారణాదుల ద్వారా సర్వాంతర్యామియగు ఆ పరమాత్మ జనులకు వారివారి హృదయములందే చక్కగ అనుభూతు డగుచున్నాడు.

నీతి: భగవానుడు సమస్తప్రాణికోట్ల యొక్క హృదయములందు అతి సమీపమున విరాజిల్లుతున్నాడు. కావున ధ్యానవిచారణాదుల ద్వారా వానిని సాక్షాత్కరించుకొని తరించవలెను.

కలిమియుండియు దారిద్ర్యము

పూర్వకాలమున ఒకానొక గ్రామమున గొప్ప ధనికుడు కలడు. అతనికి నూరు ఎకరముల భూమియు,పెద్ద పెద్ద భవనములున్ను, పలువిధములైన ఆస్తిపాస్తులున్నూ కలవు.

ఆ పరిసర ప్రాంతములోని శ్రీమంతులలో అతనిదే అగ్రతాంబూలము. ఏజన్మలోనో అతడు పెట్టిపుట్టినవాడు. అతని జీవితము ఏవిధమైన బాధలు, ఓడిదడుకులు లేక సౌమ్యముగ గడచుచు వచ్చెను. కొంతకాలమున కతనికి వార్ధక్యము దాపురించెను.

వృద్ధాప్యము వలన శరీరము శుష్కపర్ణమువలె సడలిపోయెను. అవయవము లన్నియు శిథిలములు కాజొచ్చెను. ముదిమి యందు జీవుడనుభవించు ఇడుమలు చెప్పతరమా! అతనికి ఒకే ఒక కుమారుడు కలడు.

అతడు పెద్దవాడై తండ్రికి సహాయభూతుడగనుండెను. కాని సహవాస దోషమువలన కొన్ని దురలవాట్లును కొని తెచ్చుకొనెను. త్రాగుడు మొదలైన దుర్వ్యసనములకులోనై అతడు వంశప్రతిష్టను, కుటుంబ ప్రతిష్టను మట్టిపాలు చేయదొడగెను.

చెమట కార్చి తండ్రి సంపాదించిన ద్రవ్యమునంతను క్రమక్రమముగ తనయుడు పాడుచేయుచుండెను. దుశ్శీలవంతుని యొద్ద సంపద నిలుచునా?

కొంతకాలమునకు తండ్రి ఈ విషయమును గమనించిన వాడై శేషించిన తన యావదాస్తిని బంగారముగను ఆభరణములుగను మార్పుదలచేసి దానినంతను ఒక బిందెయందుంచి ఒకనాటిరేయి ఇంటిలో అందరును గాఢనిద్రయందుండగా దొడ్డిలోనికి ప్రవేశించి ఒకచోట లోతైన గోయిత్రవ్వి ఆ బిందెను దానియందు పూడ్చి పెట్టెను.

ఈ సమాచారము ఇతరులెవ్వరికిని తెలియదు. కాలచక్రము రివ్వున తిరుగసాగెను. కొంతకాలమునకు వార్ధక్య దశయందున్న ఆ శ్రీమంతునకు రుగ్మత సంభవించెను. ఆరోగ్యము దినదినము క్షీణింపదొడగెను.

ఒకనాడు వ్యాధి తీవ్రస్వరూపము దాల్చగా ధనికుడు తనలో ఈ ప్రకారముగ వితర్కించుకొనెను 'నా శరీరము ఇక ఎక్కువ కాలము జీవించదు. వ్యాధి తీవ్రమై కాయమును కూకటివ్రేళ్ళతో పడగొట్టుటకు సిద్ధముగా నున్నది.

నా ఆస్తియంతయు సువర్ణరత్న వైడూర్య రూపమున దొడ్డిలో దాచబడియున్నది. నాకు ఒకడే కుమారుడు. అతడే నా వారసుడు. నా ఆస్తియంతయు అతనికే దక్కును.

దొడ్డిలోని బంగారపు బిందె విషయము అతనికి ముందుగనే తెలిపినచో దుశ్శీలత్వ కారణమున దానిని సర్వనాశనము చేసివేయగలడు. కనుకనే ఇంతదనుక దాని సమాచార మాతని చెవిలో పడకుండచేసితిని.

ఇక నేనెక్కువ కాలము జీవించు అవకాశము లేదు కాబట్టియు, నా వారసుడు అతడొక్కడే కాబట్టియు నా ఆస్తివిషయమై అతనికి చెప్పకతప్పదు.

రేపటి ఉదయము సూర్యోదయము కాగానే కుమారుని నాయొద్దకు బిలిచి ఉన్నవిషయ మంతయు సాకల్యముగ అతనికి తెలియజెప్పెదను. దొడ్డిలో దాచబడిన లక్షలాది రూప్యముల విలువగల సువర్ణకలశము యొక్క పోవిడి అతనికి ఎరగించెదను'.

ఈ ప్రకారముగ తనలో నిశ్చయము గావించుకొని ఆ వృద్ధుడు ఉషఃకాల మెపుడేతెంచునా యని నిరీక్షించుచు పరుండెను.

కాని విధి వైపరీత్య మేమియో అర్ధరాత్రి దాటగనే ధనికునకు కఫవాతముల తీవ్ర ప్రకోపముచే కంఠము నిరుద్ధమయ్యెను. నోటి వెంట మాటరాకుండెను. తల గిర్రున తిరుగసాగెను.

కలిమియుండియు దారిద్ర్యము Moral Story For Kids

హృదయస్పందనము సన్నగిల్లెను. ప్రఖ్యాత వైద్యులెందరో క్షణములో రప్పింపబడిరి. కాని వారి సపర్యలేవియు కలిసిరాలేదు. ఒక అరగంట కాలములో శ్రీమంతుని ప్రాణపక్షి వెడలిపోయెను.

తండ్రి మరణించిన వెనుక అతని ఏకైకకుమారుడు తండ్రికి జరుపవలసిన ఔర్ధ్యదైహిక క్రియలను యథావిధి నిర్వహించెను. వారము దినములు గడచిన మీదట ఇంటిలోని భోజనసామాగ్రి యంతయు విలుప్తము కాగా ధనికుని కుమారుడు తినుటకు తిండిలేక, కట్టుకొనుటకు బట్టలేక నానాయాతనలు పడుచుండెను.

తండ్రి తన సంపద నంతను రొక్కముగా బంగారముగా మార్చి దొడ్డిలో దాచిపెట్టెను. కాని ఆ లక్షలు ఎక్కడ ఉన్నది తెలియనందున భిక్షాధికారిగా మారిపోయెను. "అంగడిలో అన్నీ ఉన్నవి కాని -" అను సామెత అతని విషయములో చరితార్థమయ్యెను.

మధ్యాహ్నము పండ్రెండు గంటల సమయమైనది. ధనికుని కుమారునకు కరకర ఆకలి యగుచుండెను. తినుటకు ఒక్క రొట్టె ముక్క కూడలేదు. ఇక ఏమిచేయుటకు తోచక అతడు ఒక పాత్ర పట్టుకొని ఇంటింటికి వెళ్ళి "భవతీ భిక్షాం దేహి" అని యాచింప దొడగెను.

గ్రామస్థులందరు ఆశ్చర్యచకితులై "ఏమయ్యా! లక్షాధికారీ! ఈ దుర్గతి నీకేల పట్టినది. అని యాతనిని ప్రశ్నింప,అందుల కతడు "మహానుభావులారా! నేనేమో లక్షాధికారినే.

అందులకు తిరుగులేదు. కాని ఆ లక్షలు ఎక్కడున్నవో నాకు తెలియదు. అదీ వచ్చిన తిప్పలు అందువల్ల ఈ దీనావస్థ నాకు దాపురించినది" అని ప్రత్యుత్తరము చెప్పుచుండెను.

ఇట్లుండ ఒకనాడతడు తనమిత్రుని యింటికి ఏదియో యొక కార్యార్థము వెడలగా, ఆతని దయనీయావస్థను గాంచి ఆమిత్రుడాతని కిట్లు సూచన చేసెను. 'నాయనా!

మీతండ్రి జీవించియున్న కాలములో ఒకనాడు నాతో నా ఆస్తినంతను ద్రవ్యరూపమున ఒక బంగారు బిందె యందుంచి దొడ్డిలో దాచిపెట్టదలచినాను' అని పలికియుండెను. కాబట్టి మీ దొడ్డిలో త్రవ్వి చూచెదము.

ఒక వేళ బిందె దొరికినచో నీవు అదృష్టవంతుడవు, మిత్రుని యొక్క ఆ స్నేహపూర్వక వాక్యములను విని అతని సూచనమేరకు ధనికుని కుమారుడు దొడ్డియంతయు త్రవ్వి చూడగా ఒకచోట ఆ బంగారుబిందె ప్రత్యక్షమయ్యెను.

అదిగాంచి ధనికుని పుత్రునియొక్క ఆనందమునకు మేరలేకుండెను ఆ ద్రవ్యముతో అతడు తిరిగి సుఖజీవితము గడపదొడంగెను. భిక్షాధికారి దైవకృపచే మరల లక్షాధికారి అయ్యెను.

జీవుడు తనహృదయమున వెలుగుచున్న పరమాత్మయను సంపదకు, బ్రహ్మానందమను సువర్ణ కలశమునకు వారసుడు.

కాని ఆ రహస్య మెరుగక అతడు తన ఆత్మస్వరూపమును మైమరచి తాను జడమైన దేహమని భ్రమసి నానా దుఃఖము లనుభవించుచుండ సద్గురుడను మిత్రుడువచ్చి జీవుని హృదయ కమలమందు విరాజిల్లుచున్న ఆత్మను పొందుటకు మార్గమునుజూపి, అతని యథార్థస్వరూపమును బైట పెట్టి అతని వాక్కుభుక్తమగు పరమానందమును తిరిగి అతని కైవసము చేయుచున్నాడు.

నీతి: కలిమి (ఆత్మ) యుండియు దారిద్ర్యము (దుఃఖము) అనుభవించుచున్నాడు అజ్ఞాని. ఆ కలిమి యొక్క ఉనికిని సద్గురు ముఖమున గుర్తెరింగి నిరతిశయసుఖ మనుభవించుచున్నాడు జ్ఞాని.

Post a Comment (0)
Previous Post Next Post