సోమరి శిష్యుడు - Lazy Disciple Short Moral Story In Telugu For Kids


సోమరి శిష్యుడు

ఒకానొకాశ్రమములో ఒక గురువు ఒక శిష్యుడు నివసించుచుండిరి. ఇరువురుకును వేరు వేరు కుటీరములు కలవు. ఆ కుటీరములు తాటియాకుతో బాగుగ కప్పబడియుండెను. ఒకనాడు సాయం సమయమున గొప్ప పెనుగాలి వీచగా గురువుగారి కుటీరముపై గల తాటియాకులలో రెండు ఊడి గాలికి కొట్టుకొనిపోయెను.

గురువు వెంటనే శిష్యుని పిలిచి "ఒరే నాయనా! కుటీరముపై తాటియాకులలో రెండు లేచిపోయినవి. ఎక్కడ పోయినవో చూచి తెచ్చి వాటిని యథా స్థానములో పెట్టరా" - అనెను. శిష్యుడు ఏఘడియలో పుట్టెనో గాని సోమరితనమును బాగుగ అలవాటు చేసికొనెను. మూర్తీభవించిన మహాబద్ధకమే అతడు.

తమోగుణము అతనికి ఒడలంతా వ్యాపించి యుండెను. కూర్చున్నవాడు లేవలేడు. గీతలో చెప్పిన "దీర్ఘసూత్రి" కి వాడు ప్రబలదృష్టాంతము. ఇట్టి స్థితిలో అతడు గుర్వాజ్ఞను పాలించునా? వెంటనే యతడు గురువుగారికీ సమాధానమును చెప్పివైచెను - "మహాప్రభో!

ఇపుడు చీకటిపడింది. చీకటిలో ఎక్కడ వెదకుదును? వెదకినా అవి కనిపించునా? కనిపించినా వాటిని తెచ్చి కుటీరముపై పెట్టుట ఎట్లు? ఎచట చూసినా అంధకార బంధురముగా నున్నది. కాబట్టి రేపు ప్రొద్దున తప్పకుండా తెచ్చి కప్పెదను క్షమించండి!"

ఆరోజు రాత్రి ఎట్లో గడచిపోయెను. రాత్రంతయు చలిగాలి చేతను, వర్షపు తుంపరల చేతను గురువుగారు చాల బాధపడిరి. తాటియాకులు లేచిపోవుటచే ఏర్పడిన బిలమునుండి వర్షజాలము లోనికి పడుట వలన గురువుగారి కుటీరములోని పుస్తకములు, దర్భాసనము, కమండలువు, జపమాల మొదలైనవన్నీ తడిచిపోయెను.

తెల్లవారగనే గురువు శిష్యుని కేకవేసెను. కాని వాడు అతినిద్రలో ఉండుట వలన పలుకలేదు. మూడు కేకలు వేసినప్పటికినీ రానందుచే గురువు తానే శిష్యుని కుటీరము వద్దకు పోయి ఆ కలియుగ కుంభకర్ణుని నిద్రలేపి తన కుటీరమునకు గొనివచ్చి "ఒరే శంభూ!

ఆ రెండు తాటాకులు కప్పరా?" అనెను. వెంటనే శిష్యుడు కండ్లు నలుపు కొనుచు "స్వామీ! వర్షము జోరున కురియుచున్నది. ఈ సమయమున కప్పుటకు సాధ్య పడదు. వర్షము ఆగిన వెంటనే తమ ఆజ్ఞ పాలింప గలవాడను" అని చెప్పి మరల పరుండెను.

సోమరి శిష్యుడు Story Telugu

కొంతసేపటికి దైవము అనుకూలించుటచే వర్షము క్రమముగ తగ్గుచువచ్చి మరికొంతసేపటికి పూర్తిగా నిలిచి పోయెను. వెంటనే గురుదేవుడు శిష్యునిలేపి ఈ ప్రకారముగ చెప్పెను. 'ఒరే శంభూ! వర్షము ఆగిపోయినది. ఆ రెండు ఆకులు కప్పరా?' - ఆ వాక్యములను విని శిష్యుడు ఆలోచనలోపడెను.

శిష్యుని ఆలోచన చూచి గురువు అతడు కార్యమున కుపక్రమింప బోవుచున్నాడని పరమానందపడెను. ఇక తన కుటీరము బాగు పడెనేయని ఉవ్విళ్ళూరెను.

కాని ఎంతసేపు వేచిచూచినను శిష్యుడు కదలలేదు. అంతట గురువు ఆశ్చర్య సంభరితమానసుడై శిష్యుని నిట్లు ప్రశ్నించెను. "ఏమిరా! శంభూ! వర్షము ఆగిపోయి చాలాసేపయినది! తాటాకులు కప్పవేమి?"

వెంటనే శిష్యుడు ఈ ప్రకారముగ ప్రత్యుత్తర మిచ్చెను. మహాప్రభూ! తమ ఆజ్ఞను శిరసావహించవలెననియే నా అభిప్రాయము. కాని ఇప్పుడు వర్షము ఆగిపోయినది. కాబట్టి కప్పవలసిన అవసరము నాకు కనిపించుటలేదు.

చక్కటి ఎండ కాయుచున్నది. ఈ సారి వర్షము వచ్చినచో అని చెప్పి నెమ్మదిగా తన కుటీరమునకు వెడలిపోవుచుండ గురువు వానిని అపి కూర్చుండబెట్టి 'ఒరే శంభూ! ఇంత సోమరిగా ఉన్న నీవు ఎప్పుడు కడతేరతావు?

ఎపుడు చేయవలసిన పనిని అపుడే చేయవలెను. ఈ దైవ మార్గములో, పరమార్థ మార్గములో సోమరి తనమునకు ఏమాత్రము చోటీయగూడదు. తెలిసినదా?'

అని అడుగగా శిష్యుడు బ్రహ్మాండంగా తెలిసినదని జవాబు చెప్పి హృదయ పరివర్తన గావించుకొని తోడనే వెళ్ళి ఆ రెండు ఆకులు తెచ్చి కప్పివైచెను.

చిన్న వయస్సులో ఉన్నవారిని "ధ్యానము చేసికొనుడు" అని చెప్పినచో 'ఇప్పుడు దాని అవసరమేమి?' అనియు వార్ధక్యము వచ్చిన పిదప "ధ్యానము చేసికొనుడు" అని చెప్పినచో 'ఈ దుర్భర స్థితిలో ధ్యానము ఎటుల చేసికొనగలము?'

అని ప్రత్యుత్తరము చెప్పుదురు. వారి వాక్యములు కథలోని సోమరిశిష్యుని వాక్యములనే పోలియుండును. కావున అట్టి అలసత్వమును దులిపివైచి బాల్యము నుండియే జనులు భగవద్ధ్యాన పరాయణులై తరించుదురుగాక!

నీతిః ఏ క్షేత్రమందును సోమరితనమునకు లవలేశమైనను చోటీయరాదు.

అసూయను త్యజించవలెను

పూర్వమొకానొక గ్రామమునందు ఇరువురు వ్యక్తులు ఉండిరి. వారికి ఒకరిపై మరియొకరికి పరమద్వేషము, ఈర్ష్య అసూయ ఉండుచుండెను. ఒకరిని చూచి మరియొకరు ఓర్వలేరు. ఒకడు వృద్ధినొందు చుండిన, మరియొకడు దానిని చూచి బాధపడుచుండెను. ఒకనికి కష్టము కలిగిన మరియొకడు ఆనందముతో చిందులు త్రొక్కుచుండెను. ఈ ప్రకారము వారిలో ఒకనిపై మరియొకనికి అసూయ తాండవించుచుండెను.

అసూయ అనునది ఒక మహాదుర్గుణము. ఎన్ని సుగుణములున్న ప్పటికిని అసూయ అను ఈ ఒక్క దుర్గుణ మున్నచో తక్కిన గుణము లన్నియు నిర్వీర్యములై శోభావిహీనములై యుండును. కళాయి లేని పాత్రలో వండిన పప్పుపులుసు చెడిపోవునట్లు అసూయాగ్రస్తుని యందు ఏ యితర సుగుణమున్ను శోభించదు.

రాణించదు. దుర్యోధనునకు బలము, ఉత్సాహము, శక్తి, సామర్థ్యము, ప్రజ్ఞ మొదలైనవి ఎన్నియో ఉన్నప్పటికిని, అసూయ అను ఒక్కదుర్గుణము వానియన్నింటిని నాశనము చేసివైచి అతని జీవితమునకే ఎసరు తెచ్చిపెట్టిన విషయము లోకవిదితమేకదా!

భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుని సంబోధించునపుడు "అనసూ యవే" అను పదమును ప్రయోగించి "అసూయ లేని ఓ అర్జునా! నీకు ఈ అతి రహస్యమైన జ్ఞానమును ఉపదేశించుచున్నాను" అని పలికి యుండుట గమనింపదగినది. అసూయ లేనివానికే చక్కని జ్ఞానోపదేశము లభించును. అసూయ అను ఈ ఘోరమైన దుర్గుణములకు ముముక్షువులు ఎంత దూరముగ నుండిన అంత మంచిది.

కథలోని ఆ యిరువురు వ్యక్తులు అసూయాగ్రస్తులై ఒకరిపై ఒకరు కారములు, మిరియములు నూరుకొనుచు, కనుపించిన చోట్లనెల్ల ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసికొనుచు కాలము గడుపుచుండిరి.

ఇట్లుండ ఒకనాడు వారిలో నొకనికి బ్రహ్మదేవుని ఉపాసించి కొన్నిసిద్ధులు సంపాదించవలెనను కోరిక జనింపగా అతడు ఊరిబయట గల ఒకానొక ఏకాంత ప్రదేశమునకు పయనమై ఒక చెట్టు క్రింద కూర్చొని ఆహారమును వర్జించి తీవ్రముగా తపముచేయ నారంభించెను.

ఈ సంగతి తెలిసికొని ఆతని శత్రువు "వాడు తపస్సు చేసినచో నేను మాత్రము అతనికి తీసిపోవుదునా? నాకు తపస్సుచేయ తాహతు లేదా? అని భావించి ఆ గ్రామము బయట మరియొక చోటుకుపోయి ఒక చెట్టు క్రింద కూర్చొని మొదటివాని వలె బ్రహ్మదేవుని గూర్చి తపము ప్రారంభించెను. ఈ సంగతి మొదటివానికి ఎట్లో తెలిసిపోయెను.

అసూయను త్యజించవలెను Story For Kids

కొంతకాలమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారల తపస్సునకు మెచ్చి వరముల నొసంగటకై మొదటివాని యొద్దకు వచ్చి 'ఓయీ! నీ తపస్సున కానందించితిని. ఏదైన వరము కోరుకొనుము' అని పలుకగా నతడు 'మహాత్మా!

ఈ గ్రామము బయట వేరొక చోట నాకు గిట్టనివాడొకడు తపస్సుచేయుచున్నడు. ముందు వానివద్ద కేగి అతడేమి కోరుకొనునో తెలిసికొని ఆతడు కోరినదానికి రెట్టింపు నాకు దయచేయుడు' అని ప్రార్థించెను.

బ్రహ్మదేవు డందుల కంగీకరించి రెండవ వానియొద్దకు వెళ్ళీ 'ఓయీ! నీ తపస్సునకు మెచ్చితిని. ఏదైన వరము కోరుకొనుము' అని పలుక, అందుల కారెండవవాడు 'మహాత్మా! తాము మొదటివాని యొద్దకు వెళ్లితిరా! ఆతడేమి కోరుకొనెను?"

అని ప్రశ్నించెను. బ్రహ్మదేవుడు " అతడేమియు కోరుకొనలేదు. ముందు నీయొద్దకు వెళ్లి నీవు కోరుదానిని తెలిసికొని దానికి రెట్టింపు ఇచ్చిన చాలును అని పలికె" ననగా, అపుడా రెండవవాడు "అట్లైనచో మహాత్మా!

నాకు ఒక కన్ను పోగొట్టుము" అని ప్రార్థించెను. బ్రహ్మదేవుడు తథాస్తూ అని చెప్పి అంతర్ధాన మయ్యెను. తోడనే ఆ రెండవవానికి ఒక కన్ను గ్రుడ్డి అయ్యెను. అతడు కోరినదానికి రెట్టింపు ఫలితము మొదటివానికిన్ని లభ్యమయ్యెను అనగా మొదటివానికి రెండు కండ్లు గ్రుడ్డిఅయ్యెను. అతడు పూర్తి గ్రుడ్డివాడుగా మారిపోయెను.

అసూయ యొక్క నగ్నతాండవము ఇచ్చోట చక్కగా దృగ్గోచరమగుచున్నది. మొదటివానిపై అసూయచే వాని నెట్లైన బాధించవలెనని తలంచి, వానిని పూర్తి గ్రుడ్డివానిగ చేయదలంచి రెండవవాడు తన ఒక కంటిని గూడ వదలుకొని, ఏకాక్షుడగుటకు సిద్ధపడెను.

అవతల వానిని బాధించు నిమిత్తము తానుకూడ బాధపడుటకై సంసిద్ధుడయ్యెను. ఇది యెంత హేయమైన స్థితియో విజ్ఞులు యోచించవలెను. ఒక్కప్రాణికి అపకారము తలపెట్టినచో అది సాక్షాత్‌ భగవంతునికి చేయు అపచారమే కాగలదని ఎంత శీఘ్రముగ మనుజుడు గ్రహించ గల్గిన అంతమంచిది.

కాబట్టి పరప్రాణికి హితమునే వాంచించుచు, ప్రాణికోట్లయెడల దయ కలిగి, జీవకారుణ్యము కలవాడై, ఎల్లడల భగవంతుని అస్తిత్వమును అనుభూత మొనర్చుకొనుచు జీవుడు పరమార్థ పథమున అగ్రసరుడు కావలయును.

అసూయ అను ఘోర దుర్గుణమును మొదలంట పెరికి వైచి హృదయమును నిష్కంటక మొనర్చుకొనవలెను. పవిత్ర హృదయమే దైవనిలయమని జనులు సదా జ్ఞప్తియందుంచు కొందురు గాక!

నీతి: అసూయ నీచమైన దుర్గుణము. దానిని మానవుడు ఏ కాలమందును దరికి చేర్చరాదు.

Post a Comment (0)
Previous Post Next Post