అంధపరంపర - Blindness Short Moral Story In Telugu For Kids


అంధపరంపర

ఒకనాటి చంద్రగ్రహణ సమయమున సముద్రస్నాన మాచరించుటకై వేలకొలది జనులు సముద్రతీరమున చేరిరి. కొందరు స్నానమాచరించుచుండిరి మరికొందరు ఒడ్డున తిరుగాడుచుండిరి.

సముద్రతీర మంతయు జనసందోహముచే కోలాహలముగ నుండెను. ఆ సమయమున నొకానొక సాధువు స్నానార్థమేతెంచి ఒడ్డున నిలబడి ఏదియో ఆలోచించుచుండెను.

ఆతనియొద్ద ఒక రాగి చెంబు ఉండెను. దానిని చేతగైకొని నీళ్ళలో దిగినచో తరంగముల తాకిడికి అది కొట్టుకొనిపోవచ్చును. పోనిండు,ఒడ్డున ఎచ్చటనైనా ఉంచెదమా యనిన, స్నానముచేసి వచ్చులోపల దాని నెవరైనా ఎత్తుకొని పోవచ్చును.

ఈ డోలాయమాన పరిస్థితులలో ఆ సాధువు అచ్చోట స్నానము చేయక, దూరముగ పోయి సముద్రపుటొడ్డున ఎవరును లేనిచోటును చేరుకొనెను. అచ్చోట తీరమున ఒక చిన్నగోతిని త్రవ్వి అందులో తన రాగిచెంబును ఉంచి దానిపై ఇసుకతో ఒక కుప్పచేసి స్నానము చేయుటకు పోయెను.

సాధువుగారు తాను చేసినపని ఎవరును చూడలేదని భావించి సంతుష్టు డయ్యెను. కాని దూరమునుండి ఒక వ్యక్తి అది యంతయూ గమనించుచుండెను.

ఆ వ్యక్తి తనలో ఇట్లు వితర్కించుకొనెను - "సాధువు సామాన్యుడు కాడు. ఎంతయో తపస్సు చేసిన మహాత్ముడు ఎన్నియో శాస్త్రములను తిరుగవేసినవాడు, అట్టివాడు ఏది చేసినను ప్రమాణపూర్వకముగనే చేయును.

చంద్రగ్రహణ సమయమున సముద్ర తీరమున ఇసుకలో శివలింగము చేసినచో ఏదియో గొప్ప పుణ్యము ఉండును గనుకనే ఈ గ్రహణ సమయమున అతడు లింగమును నిర్మించెను. మఱియు అతడు లింగమును నిర్మించిన స్థలమున్ను ఏదియో మహిమతో కూడియుండును.

లేనిచో ఆ చోటుననే లింగ నిర్మాణమున కాతడెందులకు ఎన్నుకొనియుండును? కాబట్టి ఆ పుణ్యభాగ్యమును నేనును పొందెదను" అని తలంచి ఆ లింగము ప్రక్కన అదేకొలతలో నతడు మఱియొక లింగమును ఇసుకతో చేసి స్నానము చెయుటకు వెడలెను.

అంధపరంపర Moral Story For Kids

ఇంతలో మఱియొకడు దానిని చూసి గ్రహణ సమయమున ఆ పుణ్యమును తానెందులకు పోగొట్టుకొనవలెనని తలంచి దాని ప్రక్కన ఇంకొక లింగమును చేసెను.

ఈ ప్రకారముగ ఒకరిని చూచి మఱియొకరు ఆ సముద్రమున ఇసుకతో లింగములను చేయమొదలిడిరి. సాధువుగారు స్నానము చేసి తిరిగి వచ్చుసరికి అచట కొన్నివందల లింగములు ఏర్పడియుండెను.

ఇక తన రాగి చెంబు ఏలింగములో ఉన్నదో అతనికి అంతుపట్టలేదు. ఆశ్చర్యచరితుడై, జనులయొక్క అంధపరంపరను గూర్చి ఖేదమొంది అత డీ శ్లోకమును చెప్పదొడగెను.

గతానుగతికో లోకో న లోకః పారమార్థికః |
సేతౌ సైకతలింగేన వినష్టం తామ్రభాజనమ్‌ ||

అనగా, జనులలో పెక్కురు యుక్తాయుక్తములను విచారించక గ్రుడ్డిగా పనులాచరించుచుందురు. ఒకరుచేసిన పని ఎందుకాయని ఆలోచించకనే వారు చేసిన దానిని అనుకరించుదురు.

ఏదియెట్లున్నను సముద్రస్నానమునకు వచ్చిన ఇసుకకుప్పను చేయుటవలన నా రాగి చెంబు గల్లంతు అయినది. అహా! జనులది ఎట్టి అంధపరంపర" అని వాపోవదొడగెను.

అదే విధముగ, జనులలో పెక్కురు తమ పూర్వికులు ఏ ప్రకారము బహిర్ముఖదృష్టి కలవారై, ప్రపంచవ్యవహార నిమగ్నులై, దృశ్యవ్యామోహమునబడి కొట్టుకొనిపోయిరో,ఆ ప్రకారము తామున్ను అచరించుచున్నారే కాని, "తామెవరు?

తన నిజస్వరూపమేమి, ఎచ్చటనుండి వచ్చినారు. ఎచట కేగవలెను, జీవితపరమావధి యేది" అని పరమార్థ మును విచారించువారు చాల అరుదు.

కనుక అట్టి అంధపరంపరను విడనాడి జగద్వ్యవహారములతో బాటు తానెవరో, జగత్తేమియో, దైవమును పొందుటెట్లో చక్కగా విచారించి, మానవజీవితమును సార్థకమొనర్చుకొనుట శ్రేయస్కరము.

నీతి: దేనినీ గ్రుడ్డిగ అనుకరించగూడదు. అదియుక్తమా, అయుక్తమా అని వివేకముతో యోచించవలెను.

విశ్వాసమును బట్టియే ఫలితము

పూర్వమొకానొక పట్టణమున ఒక వైద్యుడు కలడు. అతడు తన వృత్తియందు గొప్ప ప్రావిణ్యము గలిగి యుండుటవలనను, తాను చేపట్టిన కేసులన్నిటిని జయప్రదముగ నెరవేర్చుచుండుట వలనను, జనులనేకులు చికిత్సార్థము అతని యొద్దకే వచ్చుచుండిరి.

ప్రతిదినము అతని వైద్యాలయము రోగులచేతను,ఆరోగ్యవిషయమై సంప్రదింపులకు వచ్చువారిచేతను కిటకిటలాడుచుండును. పేరుమ్రోగిన భిషగ్వర్యుడగుట వలన చుట్టుప్రక్కల పల్లెలనుండి కూడా బండ్లుకట్టుకుని ఎందరో అతని కడక వచ్చుచుందురు.

ఒకనాడు రాత్రి 8 గంటలకు అతడు తన కార్యక్రమమంతయు పూర్తిచేసుకొని, రోగుల నందరిని పంపివేసి వైద్యాలయమునకు తాళము వేసి అరమైలు దూరమున నున్న తనయింటికి ప్రయాణమైపోవ నుద్యుక్తుడై గడప దిగగనే ఒకరోగి పరుగుపరగున వచ్చి 'మహాప్రభో!

కడుపునొప్పిగా ఉన్నది. మందు దయచేయుడు ' అని ప్రార్థించెను. అపుడు డాక్టరుగారు "నాయనా! ఇప్పుడే వైధ్యాలయము మూసివేసినాను. మూసిన ఆసుపత్రిని మరల ఉదయము లోపల తెరుచు అలవాటు నాకులేదు.

ఈ ప్రకారముగ గత ముప్పది సంవత్సరములనుండియు జరుగుచున్నది. తలుపు మూసిన తరువాత ఎవరు వచ్చినను వారిని నాయింటికి తీసుకొనివెళ్లి అచట మందు ఇచ్చుచుందును.

కాబట్టి మీరునూ నావెంట వచ్చినచో ఇంటివద్ద తగినమందు ఇవ్వగలను. ఇపుడు మాత్రము మీరు నాకు చెప్పినప్పటికి నేను తలుపు తెరవనే తెరవను. మందు ఇవ్వనే ఇవ్వను. దయచేసి ఇంటికి రండు. మీకు కావలసిన చికిత్స చేసెదను" అని పలికెను.

అపుడు వెంటనే రోగి 'మహాత్మా! నాబాధ గమనించి, ఇదియొక అత్యవసర పరిస్థితిగా భావించి తలుపు తీయుడు. ఇందు అనౌచిత్య మేమియులేదు.

ఎట్టి త్యాగమైనా చేసి లోకములో మహనీయులు పరోపకారము చేయుచుందురు. కావున ఈ చిన్నసహాయమును మాకు చేయుడు. తలుపు తెరిచి నన్ను విపరీతముగా బాధించుచున్న ఈ కడుపునొప్పికి ఏదైన మందు శీఘ్రముగా దయచేయుడు ' అని వచించెను.

అతని వాక్యములను విని వైద్యనాథుడు రోగితో "అయ్యా! మీరు చెప్పినది బాగుగనేయున్నది. కాని ముప్పది సంవత్సరములనుండి తప్పకుండ పాలించుచున్న ఈనియమమును ఇపుడు మీ ఒక్కరి కొరకు మార్చుటకు నాకు మనస్సు ఒప్పుటలేదు.

కాబట్టి వేసిన తలుపులును ఉదయములోపల తెరువను. నావెంట వచ్చినచో మీబాధ తొలగుటకు ఇంటియొద్ద మందు తప్పక ఇవ్వగలను" అని పలికి రోగిని తన వెంటబెట్టు కొని ఇంటికి పయనమై పోవుచుండెను.

విశ్వాసమును బట్టియే ఫలితము Short Story In Telugu

అది రాత్రి సమయము. పట్టణవీథులు విద్యుద్ధీపకాంతులచే శోభించుచుండెను. రోగి వెంటరాగా భిషగ్వర్యుడు ముందు నడచుచుండెను. కాని వారిరువురు పదిగజములు దాటిరో లేదో రోగి వైద్యునకు అడ్డుతగిలి 'డాక్టరుగారూ!

నొప్పి తీవ్రముగానున్నది. ఇక తట్టుకొనలేను. త్వరలో ఏదైనా మందు ఇవ్వండి' అని ప్రాధేయపడెను. అపుడు వైద్యుడు రోగియొక్క ధాటికి తట్టుకొనలేక తన కోటుజేబులో ఏదియో మాత్రవంటిది తీసి రోగిచేతిలో పెట్టి "నాయనా!

దీనిని సేవించుకొనుము దీనిని నోటిలో వేసికొని చప్పరించుము. నమలవద్దు" అని ఆదేశించెను. రోగి పరమానందముతో దానిని స్వీకరించి నోటిలోవేసుకొని చప్పరించుచు డాక్టరుతో రోగి 'నాయనా! తమ దయవలన సగము నొప్పి తగ్గిపోయినది అని బదులు చెప్పెను. అంతట డాక్టరు రోగితో ఇక మీరు మీయింటికి వెళ్ళవచ్చును' అని పంపివేసెను.

దీపప్రభలచే పగలువలె తోచుచున్న ఆపట్టణ వీథులగుండా చనుచు వైద్యునిచే ఒసంగబడిన మాత్రనువిడువకుండ చప్పరించుచు రోగి తన బాధ శమించుచుండ పరమానందభరితుడై గృహాభిముఖుడగుచు పోవుచుండెను.

కాని ఎంతసేపు చప్పరించినను మాత్ర కరగనందున రోగి ఆశ్చర్యచకితుడై 'తనలో ఇదియేమి విలక్షణమైన మాత్ర! అరగంటసేపు చప్పరించినను కరగదే! ఉన్నది ఉన్నట్లే ఉన్నదే! కారణమేమి?'

అని సంభ్రమచిత్తుడై ఒకానొక వీథిదీపముక్రింద ఆ మాత్రను తన అరచేతిలో ఊసుకొని చూచెను. రామ! రామ! అది మాత్రకాదు. కోటుగుండీ! వైద్యుడు అతనిపోరు పడలేక తన కోటుజేబులో ఉన్న గుండీని తీసి అతనికిచ్చెను అంతియే.

సామాన్యమైన ఒకకోటుగుండీ రోగియొక్క కడుపునొప్పిని సగము తగ్గించి వైచుట జరిగినది. యథార్థముగ గుండీ అంతపని చేయగలదా? లేదు. రోగికి డాక్టరు పైగల అకుంఠితవిశ్వాసమే అంతపని చేసినది.

కావున విశ్వాసము ఎంతటిపని నయినను సాధించగలదు. ఒక గ్రంథముపైగాని, ఒక గురువుపైగాని, ఒక వైద్యునిపైగాని, ఒక మంత్రముపైగాని మనుజునకు ఎంతెంత విశ్వాసముండునో అంతంత అధిక ఫల మతనికి కలుగుచుండును.

కావున దైవవిశ్వాసము, గురువిశ్వాసము, మంత్రవిశ్వాసము, ఆత్మవిశ్వాసము ముముక్షువునకు తప్పక ఉండవలెను. అపుడు మాత్రమే ఆధ్యాత్మక్షేత్రమున గొప్పగొప్ప ఫలముల నాతడు సాధింపగల్గును.

అట్టి విశ్వాసము లేనివాడు ఏక్షేత్రమందును పురోభివృద్ధిని బడయజాలడు. కాబట్టి సాధకుడు తాను జపించు మంత్రమునెడల, తనకుపదేశించిన గురువునెడల తన్ను సృష్టించిన ఈశ్వరునియెడల తాను పఠించు గ్రంథముయొక్క రచయితయెడల,తన యెడల, గొప్పవిశ్వాస ముంచుకొని పరమార్థరంగమున ముందునకు సాగిపోవలెను.

నీతి: విశ్వాసము గొప్పఫలితములను కలుగజేయును. కాబట్టి దైవవిశ్వాసము, గురువిశ్వాసము, శాస్త్రవిశ్వాసము, ఆత్మవిశ్వాసము గలిగి యుండి ఆధ్యాత్మిక అభ్యున్నతిని సాధించవలయును.

Post a Comment (0)
Previous Post Next Post